jagital : కొంపముంచిన కామం.. పిలిచింది కదా అని ఎగేసుకుని వెళ్తే!

Jagtial

jagital : జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలను జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధం, బ్లాక్‌మెయిలింగ్ చివరకు ఒక ప్రాణాన్ని బలిగొన్న తీరు ఈ దర్యాప్తులో వెలుగుచూసింది.

పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన బుర్ర మహేందర్ గౌడ్ (32)హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేసేవాడు. ఇప్పటికే ఇతగాడికి పెళ్లి అయింది. భార్య కూడా ఉంది. మహేందర్ ఒక అమ్మాయి పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బైరవేని సమతతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత అసలు నిజం చెప్పి తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె అక్క గర్వందుల సంధ్యతో కూడా పరిచయం ఏర్పడింది. ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

అయితే, మహేందర్‌కు అప్పటికే వివాహం జరిగిందని తెలుసుకున్న సమత, అతనితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంది. అయితే ఇటీవల సమతకు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న మహేందర్, గతంలో తమ మధ్య ఉన్న ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, కాబోయే భర్తకు పంపిస్తానని సమతను, ఆమె అక్క సంధ్యను తీవ్రంగా బెదిరించడం మొదలుపెట్టాడు.

మహేందర్ వేధింపులు భరించలేక, తమ పరువు పోతుందన్న భయంతో అక్కాచెల్లెళ్లు అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. తమకు తెలిసిన రాజశేఖర్, నరేష్ గౌడ్ అనే ఇద్దరు మైనర్ల సాయం కోరారు. ప్లాన్ ప్రకారం, సంధ్య తనతో మాట్లాడాలని మహేందర్‌ను జగిత్యాలకు రప్పించింది.

డిసెంబర్ 26న మహేందర్ జగిత్యాలకు రాగా, నిందితులు అతడిని లక్ష్మీపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పథకం ప్రకారం మహేందర్ కళ్లల్లో కారం కొట్టి, ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మహేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమకు సంబంధించిన సాక్ష్యాలు ఏవీ దొరకకూడదని భావించిన నిందితులు, మహేందర్ మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు

నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కారు, ఒక బైక్, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు గురై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, ఇలాంటి సమయాల్లో పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.