Duvvada Srinivas : గోడ దూకేస్తున్న దువ్వాడ.. మాధురి ప్లానేనా!

duvvada srinivas

Duvvada Srinivas :  వైసీపీ నుంచి ఏడాది క్రితమే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్‌తో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ కావడంతో ఆయన తన తదుపరి రాజకీయ మనుగడ కోసం కమలం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీలోని పలువురు బడా నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన కళింగ ఆత్మీయ కలయిక సమావేశంలో, కళింగ సామాజిక వర్గ మనుగడ కోసం బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆ వర్గం పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఆ నిర్ణయం మేరకే దువ్వాడ ఈ అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దివ్వెల మాధురి సలహా మేరకు ఆయన ఈ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? అధిష్టానం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ (PRP) తరపున టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత వైసీపీలో చేరారు.

పార్టీలో క్రియాశీలక నేతగా, ఉత్తరాంధ్రలో కళింగ సామాజిక వర్గ ప్రతినిధిగా ఎదిగారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. ఆయన విధేయతను గుర్తించి వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) అవకాశం కల్పించారు. క్రమశిక్షణా రాహిత్యం ఆరోపణలతో ఏడాది క్రితం వైసీపీ ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది.