స్కూల్ BUS బోల్తా : డ్రైవర్ జంప్.. చావుబతుకుల్లో పిల్లలు!

bus

BUS : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెనుబల్లి మండలం గణేష్‌పాడు వద్ద శుక్రవారం సాయంత్రం భారీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వేంసూరు మండలం మొద్దులుగూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయానికి చెందిన పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 107 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. సాధారణంగా 50 నుండి 60 మంది పట్టే బస్సులో ఏకంగా 100 మందికి పైగా విద్యార్థులను ఎక్కించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని బస్సులో ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. అతివేగంతో పాటు డ్రైవర్ అజాగ్రత్త వల్లే బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో హుటాహుటిన పెనుబల్లి, వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించినట్లు సమాచారం. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.