Palakollu : అమెరికాలో రోడ్డు ప్రమాదం..పాలకొల్లు దంపతుల మృతి

palakollu

Palakollu :అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిషోర్, ఆశా దంపతులు వాషింగ్టన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించగా, వారిద్దరి పిల్లలు గాయాలతో బయటపడ్డారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కృష్ణ కిషోర్ తన భార్య ఆశా ఇద్దరు పిల్లలతో కలిసి వాషింగ్టన్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు తీవ్రంగా దెబ్బతినడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి సంతానమైన కుమారుడు, కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులు, కేవలం పది రోజుల క్రితమే తమ స్వగ్రామమైన పాలకొల్లుకు వచ్చి వెళ్లారు. ఊరి నుంచి తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో దుబాయ్‌లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని అక్కడికి చేరుకున్నారు. అమెరికా చేరిన కొద్ది రోజులకే ఇలా ప్రమాదానికి గురవ్వడం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.