Anasuya: దిగొచ్చిన అనసూయ..ఎట్టకేలకు క్షమాపణలు!

Anasuya

Anasuya: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఎట్టకేలకు దిగొచ్చింది. సీనియర్ హీరోయిన్ రాశిపై గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. గతంలో జబర్దస్త్ షోలో జరిగిన పరిణామాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు.

గతంలోజబర్దస్త్ షోలో హైపర్ ఆది చేసిన ఓ స్కిట్ లో భాగంగా ‘రాశి ఫలాలు’ అనే డైలాగ్ కు అనసూయ స్పందిస్తూ “నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?” అని ప్రశ్నిస్తారు. ఆ జోక్ కు జడ్జి రోజా నవ్వులు ఆపుకోలేకపోతారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ ఘటనపై నటి రాశి స్పందించారు. నటుడు శివాజీ సామాన్లు కామెంట్స్ పై అనసూయ స్పందించిన నేపథ్యంలో.. ‘రాశి గారి ఫలాలు’ అని ఆమె కామెంట్ చేయడం కరెక్టా అని రాశి ప్రశ్నించారు.

రాశిగారి ఫలాలు అంటూ స్కిట్‌లో తాను రాశి పేరును ఉపయోగించినందుకు అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆ స్కిట్ ద్వారా ఎవరినైనా నొప్పించి ఉంటే అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని ఆమె స్పష్టం చేశారు. “రాశి గారూ, నా క్షమాపణలు అంగీకరించండి” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆ సమయంలో జరిగిన తప్పుపై అనసూయ స్పందిస్తూ.. “అప్పట్లో నాకు తెలుగు అంతగా రాదు. ఆ సమయంలో నా చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించారు. అప్పుడు జరిగిన తప్పును నేను ఇప్పుడు సరిదిద్దలేను, కానీ ఆ విషయంలో ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను” అని పేర్కొన్నారు.

తొలి రోజుల్లో తెలియక చేసిన పొరపాట్ల పట్ల క్షమించాలని, సీనియర్ నటి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని అనసూయ ఈ సందర్భంగా వెల్లడించారు.