Techie : బెంగళూరులో ఇటీవల టెక్కీ మరణం కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ముందుగా దీనిని ఓ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించగా .. విచారణలో దీనిని ఓ కిరాతక హత్యగా తేల్చారు.
రామమూర్తి నగర్ సబ్రహ్మణ్య లేఅవుట్లో నివాసం ఉంటున్న 34 ఏళ్ల టెక్కీ షర్మిల మృతి కేసు కీలక మలుపు తిరిగింది. జనవరి 3న ఆమె ఫ్లాట్లో మంటలు చెలరేగడంతో, పొగ కారణంగా ఊపిరాడక ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు మొదట భావించారు. కానీ లోతైన విచారణలో ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ కేసులో పోలీసులు షర్మిల ఇంటికి ఎదురుగా నివసించే 18 ఏళ్ల కృష్ణయ్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన ఈ యువకుడు షర్మిలపై ప్రేమను పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి సమయంలో బాల్కనీ స్లైడింగ్ విండో ద్వారా ఆమె ఫ్లాట్లోకి చొరబడిన కృష్ణయ్య, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.
నిందితుడి నుంచి తప్పించుకునేందుకు షర్మిల ప్రయత్నించగా, అతను ఆమె మెడపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఈ ఘోర నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు, సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో బెడ్రూమ్లో మంటలు పెట్టాడు. ఆ మంటలు ఇల్లంతా వ్యాపించడంతో అందరూ ఆమె అగ్నిప్రమాదంలో చనిపోయిందని అనుకున్నారు.
నిరుగుపొరుగు వారి విచారణలో షర్మిల ఆ యువకుడితో అప్పుడప్పుడు మాట్లాడేదని తేలింది. నిందితుడి వెర్రి వ్యామోహమే ఈ దారుణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం కృష్ణయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరించి, ఘటన జరిగిన తీరును పునర్నిర్మించే పనిలో అధికారులు ఉన్నారు.
