Puja Khedkar : పూజా ఖేద్కర్ పనోడు దారుణం.. అర్థరాత్రి మత్తుమందు ఇచ్చి

Puja Khedkar

Puja Khedkar :  వివాదాస్పద మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. పుణెలోని బానేర్ రోడ్డులో ఉన్న వారి బంగళాలో శనివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. తమ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.ఈ సంఘటన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.

పూజా ఖేద్కర్ ఫిర్యాదులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎనిమిది రోజుల క్రితమే నేపాల్ నుండి వచ్చిన ఒక కొత్త పనివాడు, శనివారం రాత్రి ఆమె తల్లిదండ్రులైన దిలీప్ ఖేద్కర్, మనోరమ ఖేద్కర్లకు ఫుడ్ లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత తనను కూడా కట్టేసి తమ మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకుని పారిపోయాడని ఆమె ఆరోపించారు.

ఆ దొంగ పరారైన తర్వాత తాను ఎంతో కష్టపడి తన కట్లు విడిపించుకుని, మరొక ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించానన్నారు . పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

కేవలం వారం రోజుల క్రితమే పనిలో చేరిన వ్యక్తిపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇంట్లోని తల్లిదండ్రులతో పాటు వాచ్‌మెన్, డ్రైవర్, వంట మనిషి కూడా మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా 2023 బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్, గత ఏడాది తన హోదాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో పాటు, ఓబీసీ మరియు వికలాంగుల కోటా కింద తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారనే వివాదంలో చిక్కుకున్నారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను ఐఏఎస్ సేవల నుండి తొలగించిన విషయం తెలిసిందే.