Supreme Court : 13 ఏళ్ల నరకం…కొడుకు చావు కోసం సుప్రీంకోర్టుకు తల్లిదండ్రులు!

supreme court

Supreme Court : ఢిల్లీకి చెందిన హరీష్ రాణా అనే 32 ఏళ్ల యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. 2013లో చండీగఢ్‌లో చదువుకుంటున్నప్పుడు పీజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయమై కోమా వంటి స్థితిలోకి వెళ్లిపోయాడు. అంటే అతను కళ్లు తెరవలేడు, చేతులు కదలవు, మాట్లాడలేడు. కేవలం గొట్టాల ద్వారా శ్వాస, ఆహారం అందుతోంది. గడిచిన 13 ఏళ్లుగా అతను మంచంపై శవంలా పడి ఉన్నాడు. తమ కుమారుడికి కరుణామరణం ప్రసాదించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది.

కొడుకు కోలుకుంటాడని ఆశతో హరీష్ తల్లిదండ్రులు తమ ఇంటిని కూడా అమ్ముకున్నారు. కానీ పరిస్థితి మెరుగుపడలేదు. తన కొడుకు పడుతున్న నరకాన్ని చూడలేక, అతనికి కరుణామరణం ప్రసాదించాలని వారు కోర్టును వేడుకుంటున్నారు. మా కొడుకును ఇలా బతికించడం కంటే, అతనికి గౌరవప్రదమైన మరణాన్ని ఇవ్వండని వారు కోరుతున్నారు.

ఇండియాలో మరణాన్ని కలిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం నేరం.పాసివ్ యురేనేషియా అంటే.. ఒక వ్యక్తి కోలుకునే అవకాశం లేనప్పుడు అతనికి అందుతున్న లైఫ్ సపోర్ట్ ను నిలిపివేయడం చట్టబద్ధం. 2024లో ఢిల్లీ హైకోర్టు ఈ విన్నపాన్ని తోసిపుచ్చింది. హరీష్ కేవలం గొట్టాల ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని, అది తీసేస్తే ఆకలితో చనిపోతాడని, అది హత్య అవుతుందని కోర్టు పేర్కొంది.

హరీష్ పరిస్థితి మరింత క్షీణించడంతో సుప్రీంకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డు కూడా హరీష్ కోలుకునే అవకాశం లేదని, అతని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని రిపోర్ట్ ఇచ్చింది. కాగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవేళ కోర్టు హరీష్‌కు చికిత్స నిలిపివేయమని చెబితే, 2018లో కరుణామరణం చట్టబద్ధం అయిన తర్వాత అమలు కాబోతున్న మొదటి కేసు ఇదే అవుతుంది.