NTV ఛానల్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మహిళా ఐఏఎస్ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్య వార్తలు, బూతు వ్యాఖ్యలతో కథనాలు ప్రసారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడినట్లుగా సమాచారం.
ఈ క్రమంలో NTV లైసెన్స్‌ను రద్దు చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ (MIB)కి లేఖ రాయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే, ఈ కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీని వెనుక ఎంతటి వారున్నా అరెస్ట్ చేయాలని సీఎం స్పష్టం చేసినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు NTV జర్నలిస్టుల అరెస్ట్ ఉదంతంలో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ (ఇన్పుట్ ఎడిటర్), సుధీర్ల రిమాండ్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారికి బెయిల్ మంజూరు చేసింది.
సిట్ (SIT), సీసీఎస్ పోలీసులు జర్నలిస్టులకు రిమాండ్ విధించాలని చేసిన అభ్యర్థనను మెజిస్ట్రేట్ తిరస్కరించారు. బాధితులెవరూ స్టేట్మెంట్ ఇవ్వలేదని జర్నలిస్టుల తరపు లాయర్ వాదించగా, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. రూ.20 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నిందితులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని షరతు విధించింది.
ఇక రాష్ట్ర మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత విషయాలపై అసత్య వార్తలు, అభ్యంతరకర కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్‌ను విమానాశ్రయంలో, సుధీర్‌ను తన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెయిల్ పొందిన అనంతరం దొంతు రమేష్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము చేయని తప్పుకు అరెస్ట్ చేసి, 24 గంటల పాటు తమను మానసిక క్షోభకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
