LPG Cylinder : రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్ జాతీయ రహదారిపై ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు పాత టోల్ ప్లాజా సమీపంలో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో దాదాపు 150 సిలిండర్లు ఉన్నాయి. లారీ పల్టీ కొట్టడంతో ఆ సిలిండర్లన్నీ హైవేపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఉదయం పూట ఈ ఘటన జరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, తోటి వాహనదారులు వెంటనే స్పందించి ఆయన్ని లారీలో నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు ఎక్కడా లీక్ కాకపోవడం, మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ సిలిండర్లు పేలి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని, ఆ సమయంలో హైవేపై ఉన్న వాహనాలు కూడా ప్రమాదంలో పడేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఎంతో తెగువతో సహాయక చర్యలు చేపట్టారు. హైవేపై పడిపోయిన సిలిండర్లను పోలీసుల సహాయంతో పక్కకు చేర్చి రహదారిని క్లియర్ చేశారు. స్థానికులు చూపిన అప్రమత్తత వల్ల ట్రాఫిక్ సమస్య త్వరగానే పరిష్కారమైంది. సమాచారం అందుకున్న మదన్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అతివేగం, ఓవర్లోడింగ్ లేదా వాహనంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మినహా మరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
