సురేష్ టెర్రర్ : విజయారెడ్డి హత్యతో రెవిన్యూ అధికారుల్లో భయం, ముందుజాగ్రత్తలు

అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రెవిన్యూ అధికారులు-ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడలేని భయం పుట్టించింది. ఓ సాధారణ రైతు కాళ్లు మొక్కే స్టేజ్ నుంచి కాల్చి చంపేదాకా దారితీసిన పరిణామం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రెవిన్యూ అధికారులైతే హడలెత్తిపోతున్నారు. ఈ ఎఫెక్ట్ తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ కనిపిస్తోంది. అధికారుల్లో మొదలైన భయం వాళ్లను ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. విజయారెడ్డి హత్య తర్వాత కర్నూలు జిల్లా పత్తికొంత తహశీల్దార్ ఉమామహేశ్వరి చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. తన చాంబర్ లో ఓ తాడు కట్టించిందామె. అర్జీలు, ఫిర్యాదులు చేసే వాళ్లు ఎవరైనా బయటి నుంచే ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు తన చాంబర్ కు వచ్చేవాళ్లు వెంట ఏం తెచ్చుకున్నారో పరిశీలించాలని అటెండర్లను, ఆఫీసు సిబ్బందిని హెచ్చరించారు. విలేకరుల ఇదేంటి మేడం అని ప్రశ్నించగా ‘‘మా జాగ్రత్తల్లో మేముండాలిగా’’ అని సమాధానమిచ్చింది.

ముందు జాగ్రత్తలు సరే. ప్రాణాల మీద తీపి ఉండటం కామన్. మరి తప్పు చేయకపోతే అంత భయమెందుకు ? ఇదే ఇపుడు జనం వస్తున్న సూటి ప్రశ్న. ప్రభుత్వం-అధికారులు బలవంతుడికి బలహీనంగా, బలహీనుడిపై మరింత బలంగా అమలవుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యుడి తిరుగుబాటు మరింత పెరిగే అవకాశముందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. విజయారెడ్డి హత్య కేసు ఇంకెన్ని విపరిణామాలకు దారితీస్తుందోనన్న టెన్షన్ మొదలైంది.