సజీవదహనమైన ఎమ్మార్వో విజయారెడ్డి : కొన్ని ఆసక్తికర విషయాలు

పట్టపగలు. మిట్టమధ్యాహ్నం. సమయం ఒంటిగంట ప్రాంతం. రాష్ట్ర రాజధాని శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జనం. సోమవారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సురేష్… ఎమ్మార్వోతో మాట్లాడాలని పర్మిషన్ తీసుకున్నాడు. దాదాపు అరగంట పాటు అక్కడే ఉన్నాడు. తర్వాత ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. తలుపులు మూసేసి విజయారెడ్డిపై కిరోసిన్ పోసి నిప్పంటిచాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్ తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేష్ బయటకు వచ్చాడు. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలంటుకున్నాయని అరుస్తూ పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశాడు. మంటలార్పే లోపే విజయారెడ్డి సజీవదహనమైపోయారు.

విజయారెడ్డి సొంతూరు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి. ఆమె తండ్రి లింగారెడ్డి కొండారం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లికి చెందిన సుభాష్ రెడ్డితో విజయారెడ్డి వివాహం జరిగింది. సుభాష్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. వారికి ఇద్దరు పిల్లలు. విజయారెడ్డి కుటుంబం కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. చాలా చిన్న వయసులోనే గ్రూప్-2 పోస్ట్ సాధించారామె. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో గతంలో ఎమ్మార్వోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. పాసుబుక్కుల వ్యవహారంలో గతంలోనూ పలువురితో ఆమె వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.