ఎమ్మార్వో‎ను సజీవ దహనం చేసిన సురేష్ ఎవరంటే ?

కూర సురేష్ ముదిరాజ్. ఓ సాధారణ రైతు. భార్య, ఓ కొడుకు, ఓ కూతురు, తల్లిదండ్రులతో కలిసి కాలం వెళ్లదీసేవాడు. సున్నిత మనస్కుడు. అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం. కానీ ఇపుడు అబ్దుల్లాపూర్ మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని సజీవదహనం చేసి నిందితుడిగా మారాడు. అతని స్వగ్రామం ఇబ్రహీపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం గౌరెల్లి. సురేష్ కు బాచారం దగ్గర ఔటర్ రింగు రోడ్డు అవతల 7 ఎకరాల వ్యవసాయ భూమి(మార్కెట్ విలువ ప్రకారం ఎకరం కోటి చొప్పున రూ.7 కోట్లు ఉంటుందని అంచనా) ఉంది. ఆ భూ వివాదం కోర్టు పరిధిలో ఉందని కొంతమంది చెప్తున్నారు. ఆ భూమికి సంబంధించి కోర్టు చుట్టూ, రెవిన్యూ ఆఫీసు చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి విసిగి వేసారిపోయాడని స్థానికుల కథనం. గత రెండు నెలలుగా పూర్తిగా ఆ భూవివాదంపైనే సీరియస్ గా ఫోకస్ చేశాడని చెప్తున్నారు.

అయితే తహశీల్దార్ విజయారెడ్డి అవతలి పార్టీతో కుమ్మక్కై సురేష్ కు వ్యతిరేకంగా పనిచేసిందన్నది సురేష్ బంధువులు చెప్తున్న వెర్షన్. ఆ కోపంలోనే విజయారెడ్డిపై దాడికి తెగబడ్డట్టు తెలుస్తోంది. పూర్తిగా నిస్సహాయస్థితిలోకి వెళ్లిన తర్వాతే సురేష్ ఈ ఘటనకు తెగబడి ఉండొచ్చని ఆయన సన్నిహితులు చెప్తున్న మాట.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లిన సురేష్… విజయారెడ్డిని కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో ఎమ్మార్వో రూం తలుపులు మూసేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు సురేష్. తర్వాత తానూ నిప్పంటించుకుని బయటకు పరుగులు తీశాడు. బయటకొస్తూ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కేకలు వేస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. స్టేషన్ ముందే కుప్పకూలిపోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతనికి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం 40 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు సురేష్. అతను పూర్తిగా కోలుకుంటే తప్ప ఈ దాడికి సంబంధించిన తెరవెనుక వాస్తవాలేంటో  తెలిసే అవకాశం ఉంది.