Tirupati : ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ, జీవిత పోరాటంలో ఓడిపోయి తన ఇద్దరు బిడ్డలతో సహా తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది.
“పెద్దల మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకునే వారికి నా జీవితమే ఒక గుణపాఠం” అంటూ ఒక ఇల్లాలు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, భర్త బాధ్యతారాహిత్యం వెరసి ఓ నిండు ప్రాణాన్ని, ఇద్దరు పసిమొగ్గలను బలితీసుకున్నాయి.
తిరుపతి(Tirupati ) జిల్లా పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన పద్మ(28), తొరూరుకు చెందిన శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడం, శివశంకర్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో పద్మ తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. అయినా సరే, ప్రేమించిన వాడికోసం 2019లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది పద్మ. వీరికి తేజ(6), లాస్య(5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెళ్లయిన కొత్తలో అంతా బాగున్నా, రానురాను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. భర్త జులాయిగా తిరుగుతూ ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కట్టడం కూడా భారమైంది. అప్పులు పెరిగిపోవడం, భర్తతో తరచూ గొడవలు జరగడంతో పద్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.
శనివారం రాత్రి పద్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు బిడ్డలకు ఉరివేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది:
“ఒక అమ్మాయి తన భర్తలో ఏ లక్షణాలు ఉండకూడదని కోరుకుంటుందో, అవన్నీ నా భర్తలో ఉన్నాయి. నిన్ను ప్రేమించిన పాపానికి పడుతున్న కష్టాలు చాలు. నేను పోయాక మరో పెళ్లి చేసుకుంటావు కదా, కనీసం ఈసారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో” అంటూ తన ఆవేదనను లేఖలో పొందుపరిచింది.
ప్రస్తుతం పోలీసులు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక చిన్న పొరపాటు, బాధ్యతారాహిత్యం ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
