AP Crime : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. రావులపాలెం మండలం గోపాలపురంలో ఓ భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్ట ఏంజలీనా జెన్నీఫర్ థామస్ అనే మహిళ తన భర్త మట్ట శ్రీను నిద్రపోతున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి తలుపుకు గడియ పెట్టింది. శ్రీను కేకలు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్ళిచూడగా మంటల్లో చిక్కుకుని ఉన్న అతన్ని రాజమండ్రి ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఏంజిలీనా నేపాల్ కు చెందిన కెథలిక్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద కెథలిక్ పాఠశాలలో పనిచేస్తుండగా సుమారు 12 సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్ గా పనిచేసిన మట్ట శ్రీను అక్కడ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. మందుకు బానిసైన భర్త శ్రీను రోజు చిత్రవద చేయడంతో పలుమార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.
భర్త ఒత్తిడి మేరకు జీవనోపాధి కోసం 2023లో మస్కట్ వెళ్లిన ఏంజిలీనా.. తిరిగి భర్త ఒత్తిడితోనే తిరిగి వచ్చింది. పోలీసులు నిందితురాలు ఏంజిలీనాను అదుపులోకి తీసుకున్నారు. తన భర్త ప్రతిరోజు తాగి వచ్చి వేధించడంతో ఈ వేధింపులు తాళలేక దుశ్చర్యకు పాల్పడినట్లుగా ఆమె విచారణలో వెల్లడించింది. ఈ సంఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.