BIG BREAKING : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న వయసులోనే పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడి తమ భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ అడుగు వేస్తున్నారు. ఈ నిషేధానికి సంబంధించి అసలు నిబంధనలు ఎలా ఉండాలి, దీన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే అంశాలపై విధివిధానాలను ఖరారు చేసేందుకు అధికారులకు 90 రోజుల గడువు ఇచ్చారు.
మరోవైపు, మైనర్ల సోషల్ మీడియా వాడకంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇటీవల అందిన ఆర్థిక సర్వే నివేదికలో సైతం చిన్నపిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించాలని సిఫార్సు చేయడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. పిల్లలను సైబర్ ప్రపంచంలోని ప్రమాదాల నుండి కాపాడేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలకే సిద్ధమవుతున్నాయి.
