ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా చేనేత కార్మికులకు, వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కేబినేట్ నిర్ణయించింది. దీని ద్వారా చిన్నచెరుకుల చేనేత కుటుంబాలకు తక్షణ ఉపశమనం లభించనుంది. ఈ నిర్ణయాలు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నుండి అమలులోకి వస్తాయి. ఈ చర్యల ద్వారా చేనేత ఉత్పత్తుల ధరలు తగ్గి, ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో అమ్మకాలు పెరిగి, చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక చేనేత కుటుంబాల భద్రత దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నిధిని నేతన్నలు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చని, ఇది ఒక రకమైన ఆర్థిక రక్షణ కవచంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇది చేనేత కళాకారుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో కూడా చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయాలు ఆ హామీలను నెరవేర్చడంలో ఒక భాగం.ఈ నిర్ణయాలన్నీ చేనేత రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది చేనేత కార్మికులకు జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.