KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కూడా కులాల మధ్య చిచ్చు పెట్టేలా కేసీఆర్(KCR ) వ్యవహరించారని మండిపడ్డారు.కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని, శెట్టిబలిజలను ఓసీ జాబితాలో చేర్చి వారి భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన కులాలను విడదీయలేరని వ్యాఖ్యానించిన ఆయన, కేసీఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ గతాన్ని గుర్తు చేస్తూ వాసంశెట్టి సుభాష్ సంచలన సవాల్ విసిరారు. గతంలో తాను కేసీఆర్ను విమర్శించినప్పుడు, దమ్ముంటే హైదరాబాద్ రా చూసుకుందాని సవాల్ విసిరారు. నేను అక్కడికి వెళ్ళినా నన్ను ఏమీ చేయలేకపోయారని సుభాష్ గుర్తు చేశారు.
ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టాలని చూస్తే మాత్రం ఫలితం దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ గనుక ఏపీలో అడుగుపెడితే ప్రజలే తన్ని తరిమేస్తారని, బీఆర్ఎస్ పేరుతో ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని ఘాటుగా స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమం పట్ల కేసీఆర్కు ఏనాడూ చిత్తశుద్ధి లేదని మంత్రి సుభాష్ ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను విడదీసి, కొన్ని వర్గాలను ఓసీల్లో చేర్చడం ద్వారా వారికి అందాల్సిన ఫలాలను దూరం చేశారని సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవాలని చూస్తే బీసీలు ఐక్యంగా తిప్పికొడతారని, ఆ పార్టీకి ఏపీ సరిహద్దుల్లోనే అడ్డుకట్ట వేస్తామని ఆయన హెచ్చరించారు.
