Kakinada : కాకినాడ జిల్లా తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నిందితుడు నారాయణరావు(Tatika Narayana Rao) మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే ఆయన ఫ్యామిలీ అడ్డుకుంది. ఆందోళన చేసేవాళ్లను పక్కకు లాగి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు.నారాయణరావుది సూసైడ్ కాదంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు.
రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే ఇవాళ ఉదయం 7గంటలకు సూసైడ్ చేసుకున్నాడని సీఐ చెప్పాడని, ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాగా మైనర్ బాలిక అత్యాచారయత్నం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తుని కోమటిచెరువులో నారాయణరావు మృతదేహం లభ్యమైంది. వాష్‌రూమ్ పేరుతో పోలీసుల నుంచి తప్పించుకొని చెరువులో దూకిన నారాయణరావు.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇక ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొనిచ్చి, మాయమాటలు చెప్పి నిందితుడు నారాయణరావు దగ్గరయ్యాడని సమాచారం. బాలిక ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపిస్తానని స్కూలు నుంచి ఐదుసార్లు తీసుకెళ్లినట్లు, ఆమెపై మూడు సార్లు అత్యాచారం చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అతడిపై పోక్సో సహా మూడు కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
