BIG BREAKING : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మృత్యుశకటంగా మారింది. మార్కాపురం జిల్లా పరిధిలోని రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. క్షణాల్లో వ్యాపించిన మంటలు పదుల సంఖ్యలో కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి.
బ్రేకింగ్ న్యూస్
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం
టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైన బస్సు, 10 మంది సజీవ దహనం
మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా… pic.twitter.com/4JAH2eGAby
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
అసలేం జరిగింది?
హైదరాబాద్ నుండి పామూరు వైపు సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు నిప్పుల కొలిమిలా మారిపోయింది.
బస్సు, లారీ రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి బస్సులో ఉన్న వారిలో 10 మంది బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు ప్రాణభయంతో కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
కన్నీరుమున్నీరవుతున్న బంధువులు:
సంఘటనా స్థలంలో దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. క్వారీ పనుల నిమిత్తం అక్కడ ఉన్న స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి అదుపులోకి రాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుండి తమ ఊరికి వెళ్తున్న ప్రయాణికులు గమ్యస్థానానికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లడం అందరినీ కలచివేస్తోంది.
