Blast : పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్ర గాయాలు!

BLAST

Blast :  కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి పెను ప్రమాదం జరిగింది. గతంలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణాసంచా, పేలుడు పదార్థాలను కోర్టుకు తరలించేందుకు బయటకు తీస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక కానిస్టేబుల్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

క్లూస్ టీమ్ , ఫోరెన్సిక్ బృందాలు స్టేషన్ చేరుకుని గాలిస్తున్నాయి. అసలు పేలుడు ఎలా జరిగింది? ఎక్కడ పొరపాటు దొర్లింది? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. స్టేషన్ పరిసరాల్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది.