CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు పంపిణీ చేశారని ఆయన(CM Chandrababu) తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ తయారీలో బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ వాడారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
తిరుమలతో పాటుగా శ్రీశైలం ప్రసాదంలోనూ ఇలాగే కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తాను NDDB నివేదిక ఆధారంగానే ఈ విషయాలు మాట్లాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. సీబీఐ లేదా సిట్ క్లీన్చిట్ ఇచ్చాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్టులో ఉందని గతంలో వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారని సీఎం గుర్తుచేశారు.
అయితే ముఖ్యమంత్రి ఆరోపణలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఇప్పటికే NDDB నివేదిక స్పష్టంగా చెప్పిందని, అలాంటప్పుడు మళ్లీ కొత్త కమిటీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని పదే పదే కెలుకుతున్నారని, తనకు అనుకూలమైన నివేదిక వచ్చే వరకు కమిటీలు వేస్తూనే ఉంటారా అని నిలదీశారు.
తిరుమల వంటి పవిత్రమైన అంశంపై రాజకీయం చేయడం మానుకోవాలని, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు చంద్రబాబు వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
