Mobile Phones : కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకుల వస్తున్నాయి. బస్సు లగేజీ క్యాబిన్లో అక్రమంగా తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే…ప్రమాద తీవ్రత పెరిగి, ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. బస్సు బైక్‌ను ఢీకొట్టగానే ఆయుల్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ లీక్ అయిందని ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది.
బస్సు బైక్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లడం, ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగి,మంటలు ప్రారంభమయ్యాయని తెలిపింది. మొదట లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్నాయిని వివరించింది. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్‌తో కూడిన పార్సిల్ ఉంది .. మంటల వేడికి ఆ మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్ని ఒక్కసారిగా పేలాయి. తర్వాత లగేజీ క్యాబిన్‌పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు మంటలు అంటుకున్నాయని, దీంతో ఆ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేదంది ఫోరెన్సిక్ బృందం.
లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్‌తో కూడిన పార్సిల్ pic.twitter.com/TMRTtor5xW
— kotlata (@kotlataweb) October 25, 2025
ఆ కారణంతోనే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న వారే ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్ధం రావడంతో అలెర్ట్ అయిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేసి.. కిటికీ డోరు నుంచి దూకి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించిన కుడివైపునున్న ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 19 మంది కాపాడండి అంటూ అరుస్తూనే అందులోనే ప్రాణాలు వదిలారు.
