BIG BREAKING : బస్సులో మంటలు.. 25 మందికి పైగా సజీవదహనం

bus

BIG BREAKING :  కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 25 మందికి పైగా సజీవదహనం అయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. 12 మంది వరకు బయటపడ్డారని సమాచారం. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయి. దీంతో ఫుల్ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తేరుకున్నారు.

ప్రయాణికుల్లో కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకుని సజీవదహనం అయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులకు హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.