IPS Sunil Naik : ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

IPS Sunil Naik

IPS Sunil Naik :  కస్టోడియల్ టార్చర్ కేసులో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు(IPS Sunil Naik ) సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. గతంలో నమోదైన వేధింపుల కేసు విచారణలో భాగంగా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లారు. అయితే, ఆయనను ఏపీకి తీసుకువచ్చేందుకు అవసరమైన ట్రాన్సిట్ వారెంట్‌ను జారీ చేయడానికి పాట్నా హైకోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు తిరిగి గుంటూరు మొబైల్ కోర్టును ఆశ్రయించి, పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, వారిని శారీరక హింసకు గురిచేయడం (కస్టోడియల్ టార్చర్) వంటి ఆరోపణలను సునీల్ నాయక్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. తాజా వారెంట్ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు.