Bhimavaram : నమ్మించి మోసం చేశాడు.. జనసేన నేతపై మహిళ ఫిర్యాదు!

Bhimavaram

Bhimavaram :  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు జయప్రకాష్ నాయుడు తనను దారుణంగా మోసం చేశాడంటూ మద్దాల విజయలక్ష్మి అనే మహిళ సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని, ఇప్పుడు నట్టేట ముంచాడని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె విడుదల చేశారు.

విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, జయప్రకాష్ నాయుడు తన వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదుతో పాటు భారీగా బంగారం తీసుకుని మోసం చేశాడు. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా, తనను శారీరకంగా కూడా లోబర్చుకుని ఇప్పుడు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

విజయలక్ష్మి కథనం ప్రకారం.. పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానంతో ఆమె జనసేన కార్యాలయానికి వెళ్లేవారు. ఆ పరిచయాన్ని అదునుగా చేసుకున్న జయప్రకాష్, ఆమెను లొంగదీసుకున్నాడు.

అంతేకాకుండా, ఈ వ్యవహారంలో మరో షాకింగ్ విషయాన్ని ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇతర అమ్మాయిలను కూడా తన కోసం ట్రాప్ చేయాలని జయప్రకాష్ నాయుడు తనపై ఒత్తిడి తెస్తున్నాడని, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.