Kurnool Virus Injection Case : రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. మాజీ ప్రియుడి భార్యపై వైరస్ ఇంజెక్షన్‌తో దాడి!

Kurnool Virus Injection Case

Kurnool Virus Injection Case : సినిమా కష్టాలు మనుషులకి వస్తాయో లేదో కానీ సినిమాల్లోని కిరాతక ఆలోచనలు మాత్రం నేరస్తులకు వంటబట్టినట్టు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఇప్పుడు ఏపీలోని కర్నూలు జిల్లాలో(Kurnool Virus Injection Case ) జరిగింది.

ప్రియుడు దూరం పెట్టాడనే పగతో రగిలిపోయిన ఒక మాజీ ప్రియురాలు, తన ప్రియుడిని పెళ్లాడిన మహిళను అంతమొందించేందుకు ఏకంగా ప్రాణాంతక వైరస్‌నే ఆయుధంగా మార్చుకుంది. సాయం చేసే నెపంతో చేరదీసి, ఆపై వైరస్ ఇంజెక్షన్‌తో దాడి చేసింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇంతకు ఏం జరిగిదంటే..

కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణ్ కుమార్‌కు, వసుంధర అనే మహిళతో గతంలో పరిచయం ఉండేది. అయితే ఆ బంధం పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. కరుణ్ కుమార్ కొన్నాళ్ల క్రితం శ్రావణి అనే మహిళను వివాహం చేసుకున్నారు. తనను కాదని కరుణ్ వేరే మహిళను పెళ్లి చేసుకోవడాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా శ్రావణిని అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసిన వసుంధర, ఆమె వెళ్తున్న స్కూటీని ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారమే శ్రావణి బైక్ మీద నుంచి కింద పడగానే, ఏమీ తెలియనట్టు వసుంధర తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లింది.

గాయపడిన శ్రావణికి సాయం చేస్తున్నట్లు నటించి, ఆమెను బలవంతంగా ఒక ఆటోలోకి ఎక్కించారు. ఆటోలో ఉన్న వసుంధర.. అదను చూసి శ్రావణి శరీరంలోకి వైరస్‌తో కూడిన ఇంజెక్షన్‌ను ఎక్కించింది. అయితే అప్రమత్తమైన శ్రావణి గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో శ్రావణికి ప్రాణాపాయం తప్పింది. భర్త కరుణ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలు వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.