Marriage : జీలకర్ర–బెల్లం అయిపోయింది.. తాళి కట్టే టైమ్‌లో ప్రియుడి ఎంట్రీ.. కాసేపటికే

Marriage

Marriage : పెళ్లి మండపం నిండా బంధువులు… మరో నిమిషంలో పెళ్లికొడుకు వధువు మెడలో తాళి కట్టాలి. సరిగ్గా అదే సమయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అప్పటివరకు పద్ధతిగా పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, ఒక్కసారిగా మండపం దిగి ప్రియుడి పక్కన నిలబడటంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

మైలవరానికి చెందిన ఒక యువతి, యువకుడికి పెద్దలు నిశ్చయించిన ప్రకారం పెళ్లి జరుగుతోంది. శాస్త్రోక్తంగా జీలకర్ర-బెల్లం పెట్టే కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక తాళి కట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా ఒక యువకుడు మండపం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడిని చూడగానే వధువు ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. వెంటనే పెళ్లి పీటల మీద నుండి లేచి, వచ్చావా అంటూ అతని వద్దకు వెళ్ళిపోయింది.

అక్కడున్న బంధువులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండగా.. వధువు అందరి ముందూ అసలు విషయం చెప్పేసింది. “ఇతను మా ఊరు అబ్బాయి.. మేము చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాము” అని తెగేసి చెప్పింది. దీంతో పెళ్లి కొడుకు తరపు వారు, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లిని చెడగొట్టాడన్న కోపంతో వధువు తరపు వారు ప్రియుడిపై దాడికి దిగారు.

మండపం వద్ద గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను సద్దుమణిగించి, ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వధువు మాత్రం పెళ్లికి ససేమిరా అనడంతో చేసేదేం లేక పెళ్లి నిలిచిపోయింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఈ గొడవతో విషాదం నెలకొంది.