AP Bus Accident : అమ్మ ప్రేమంటే ఇది.. కొడుకును తోసేసి…మంటల్లో తాను కాలిపోయింది!

Ao bus accident

AP Bus Accident :  మార్కాపురం మండలం రాయవరం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం అందరిని కలిచివేసింది. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు, గ్రావెల్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి భారీ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది సజీవదహనమైనట్లు అధికారికంగా నిర్ధారించారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

అయితే బస్సులో చెలరేగిన మంటల నుండి తన కొడుకును కాపాడి, తను మాత్రం ఆ మంటల్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఓ తల్లి ఉదంతం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45), తన కుమారుడు మనోహర్‌తో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ప్రయాణం సాగుతుండగా అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగడాన్ని రమాదేవి గమనించారు. మంటలు క్షణాల్లో వ్యాపిస్తుండటంతో ప్రమాదాన్ని ముందే ఊహించిన ఆమె, ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాల కంటే కొడుకు ప్రాణమే ముఖ్యం అనుకున్నారు. గట్టిగా మంటలు చుట్టుముట్టకముందే తన కొడుకు మనోహర్‌ను సురక్షితంగా బస్సు బయటకు తోసేశారు.

అయితే, దురదృష్టవశాత్తూ మనోహర్‌ను బయటకు పంపిన మరుక్షణమే మంటలు ఉవ్వెత్తున ఎగసి బస్సును చుట్టుముట్టాయి. దీంతో రమాదేవి బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. తనను కాపాడిన తల్లి కళ్లెదుటే మంటల్లో చిక్కుకుని సజీవదహనం అవుతుంటే, ఏమీ చేయలేక ఆ కొడుకు విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. కన్నబిడ్డ కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన రమాదేవి మృతితో మందాడివారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులను కోరారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం లేదా అతి వేగం కారణంగా నియంత్రణ కోల్పోయి టిప్పర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించాయని సమాచారం.