KCR : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఏపీలోని పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా.. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తీరుపై విరుచుకుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు pic.twitter.com/ZhubximNf6
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా ఫామ్‌హౌస్‌లోనే పడుకొని, ప్రజలకు మొఖం చూపించని కేసీఆర్.. ఇవాళ ఏ బ్రాండ్ మందు తాగి బయటికి వచ్చారో అర్థం కావడం లేదు” అంటూ ఎద్దేవా చేశారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో తన పార్టీ వాళ్లు ఓడిపోవడంతో కేసీఆర్‌కు మతిభ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం పోయాక ప్రజల కష్టాలు పట్టని కేసీఆర్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
కేటీఆర్ వంటి అసమర్థుడిని నమ్మితే పార్టీ పూర్తిగా మునిగిపోతుందనే భయంతోనే కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చారని రాజు సెటైర్లు వేశారు. “కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే మీరు మళ్ళీ రంగంలోకి దిగారు. మీ కల్వకుంట్ల కుటుంబ స్వార్థం వల్లే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిపోయింది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీని కాపాడుకోలేక, ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్.. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పెట్టుబడుల సదస్సులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఎంవోయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్ వంటమనుషులంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్, ఏపీ అభివృద్ధి చెందాయని, అలాంటి నాయకుడిపై బురద చల్లడం మానుకోవాలని ఎంఎస్ రాజు హెచ్చరించారు.
