Kalava Srinivasulu : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్, కలెక్టర్ ఆనంద్, జిల్లా విద్యశాఖ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2025 మెగా డీఎస్సీ ద్వారా నియమింపబడ్డ నూతన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం సోమవారం డి హీరేహాల్ మండల పరిధిలోని మురడి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయుల ఉద్దేశించి కాలవ మాట్లాడుతూ… మెగా డీఎస్సీ ద్వారా రాయదుర్గం నియోజక వర్గానికి అత్యధిక సంఖ్యలో నూతన ఉపాధ్యాయులు రావడం జరిగిందన్నారు. ఇక్కడి సామాజిక పరిస్థితులు, వెనుకబాటుతనాన్ని, టీచర్ల నియామక అవసరాన్ని పదేపదే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వివరించానన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నాడు నియోజకవర్గంలో కేవలం 315 ఉపాధ్యాయ ఖాళీలు ఉండేవన్నారు. తర్వాత జరిగిన బదిలీల కౌన్సిలింగ్లో మరింత మంది బదిలీ కావడంతో ఆ సంఖ్య 491కి పెరిగిందనీ వెల్లడించారు.
పేద పిల్లలకు మంచి జరగాలని
తాజా డీఎస్సీ ద్వారా 247 ఖాళీలు భర్తీ చేసినప్పటికీ మరో 244 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలియచేశారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 755 పోస్టులు భర్తీ చేస్తే దాంట్లో 247 ఉపాధ్యాయ నియామకాలు ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలో జరగడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. పేద పిల్లలకు మంచి జరగాలని ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆశిస్తుందో ఆ మార్గం సుగమం కావడానికి అవకాశం లభించిందన్నారు.
మిగిలిన ఖాళీల విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ తో మాట్లాడినప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇక్కడికి మరికొందరిని పంపటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. 2026 జనవరిలో కొత్త డిఎస్సీ నియామకాలకు ప్రభుత్వం సమాయత్తమవుతున్న తరుణంలో వచ్చే సంవత్సరం నాటికి మిగతా 244 ఖాళీలు భర్తీ అవుతాయని ఆశిస్తున్నానన్నారు.
బాధ్యతలు చేపట్టిన నూతన ఉపాధ్యాయులు వారి విధుల్లో గొప్పగా రాణిస్తూ విద్యాభివృద్ధికి, విలువల పెంపునకు కృషి చేస్తూ ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఆశిస్తున్నానన్నారు. ఉపాధ్యాయుల నియామకంలో ప్రాధాన్యతనిస్తూ సహకరించిన వారందరికీ ఎమ్మెల్యే కాలవ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంత రెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లీ రాజు , ఎంపిటిసి గంగాధర్, దొడగట్టా రామంజి తదితరులు పాల్గొన్నారు.