East Godavari : తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడి గ్రామంలో గురువారం రాత్రి అత్యంత కిరాతకమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఒక యువకుడిని అమ్మాయి తరపు బంధువులు రాళ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ద్వారపూడికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాశ్ (41), రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆయనవిల్లి సంధ్య (40) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ బుధవారం అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి సూర్యప్రకాశ్ కుటుంబానికి ఇష్టమున్నా, సంధ్య కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
కులాంతర వివాహం చేసుకున్నారని చెల్లి భర్తను దారుణంగా చంపిన సోదరులు
నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న రాయపురం డిప్యూటీ తహసీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాష్ రావు(41)
ఇద్దరి కులాలు వేరు కావడంతో తూర్పు గోదావరి జిల్లా… pic.twitter.com/xPTZv90gis
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2026
పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కొత్త జంటపై సంధ్య తరపు బంధువులు పగ పెంచుకున్నారు. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పెళ్లికొడుకు సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులు, ఒక్కసారిగా దాడికి దిగారు. రాళ్లతో అతి కిరాతకంగా కొట్టడంతో సూర్యప్రకాశ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి. కిషోర్, సీఐ పి. దొరరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ దొరరాజు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే పెళ్లికొడుకు హత్యకు గురవ్వడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
