Tirumala : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అత్యంత వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఈ సందర్భంగా ఉగాది వేడుకల విశేషాలను భక్తులకు వివరించారు.
ఉగాదికి ముందు ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తికి వస్త్ర ఆచ్ఛాదన చేసి, గర్భాలయ గోడలు, ఉపాలయాలను సంప్రదాయబద్ధంగా శుభ్రం చేశారు. మేళతాళాల మధ్య ‘పరిమళం’ అనే ప్రత్యేక సుగంధ ద్రవ్యాన్ని తీసుకువచ్చి, ఆలయ గోడలకు లేపనంగా పూసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
ఉగాది పండుగ రోజున శ్రీవారికి అత్యంత ఖరీదైన వజ్రాభరణాలతో విశేష అలంకరణ చేయనున్నారు. మేళతాళాల మధ్య కొత్త పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి, మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు కూడా సమర్పిస్తారు.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని బంగారు వాకిలి వద్ద శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేస్తారు. అదేవిధంగా బంగారు వాకిలిలో పంచముఖాల కొలువు, నూతన సంవత్సర ఫలితాలను తెలిపే పంచాంగ శ్రవణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆ రోజున శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
