Mangalagiri : అతి చిన్న కారణాలే కొన్నిసార్లు ఊహించని అనర్థాలకు దారితీస్తాయి. తాజాగా మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఓ భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపిన ఘటన స్థానికంగా(Mangalagiri ) కలకలం రేపింది. ఎనిమిది నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య జరిగిన ఈ గొడవ చివరకు రక్తపాతంతో ముగిసింది.
పోలీసుల కథనం ప్రకారం.. షేక్ అహ్మద్ (27) అనే యువకుడు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ తన భార్య క్రాంతితో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో క్రాంతి సౌండ్ ఎక్కువగా పెట్టడంతో, అహ్మద్ దాన్ని తగ్గించమని కోరాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. కోపంతో అహ్మద్ భార్యపై చేయిచేసుకోగా, ఆవేశం కట్టలు తెంచుకున్న క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో అహ్మద్‌ను బలంగా పొడిచింది.
తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అహ్మద్‌ను స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉండాల్సిన కొత్త జంట మధ్య ఇలాంటి చిన్న గొడవ ప్రాణహాని కలిగించడం అందరినీ కలిచివేస్తోంది.
