Vizianagaram : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి… భార్య సీమంతం జరిగిన

vizayanagaram

Vizianagaram : విజయనగరం జిల్లాలో తీవ్రవిషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కొండగండ్రేడు గ్రామానికి చెందిన రేజేటి పాపినాయుడు (27),మౌనికలకు గతేడాది పెళ్లి అయింది.వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతున్న క్రమంలో మౌనిక గర్భవతి కావడంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. దీంతో ఈనెల (అక్టోబర్) 17న కుటుంబ సభ్యులు మౌనికకు సీమంతం వేడుకను చాలా గ్రాండ్ గా చేశారు.

కాబోయే బిడ్డ రాక కోసం ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఎదురుచూసింది. అయితే భార్య సీమంతం అయిపోయాక పాపినాయుడు తన స్నేహితులను కలిసేందుకు తన బైకుపై అచ్యుతాపురం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. ఫకీరుకిట్టలి జంక్షన్ సమీపంలోని రాజుగారి కొబ్బరితోట వద్ద రోడ్డుపై రైతులు మొక్కజొన్న కంకులు ఆరబెట్టి ఉండడంతో అదుపు తప్పి పడిపోయాడు.

వెంటనే అతన్ని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా.. బ్రెయిన్‌ డెడ్‌ అయిందని డాక్టర్లు చెప్పేశారు. దీంతో పాపినాయుడును విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం పాపినాయుడు మృతి చెందాడు.

దురదృష్టవశాత్తూ, పాపినాయుడు తండ్రి కూడా ఇలానే 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే బ్రెయిన్‌ డెడ్‌ అయి మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. పెళ్లయిన ఏడాదిన్నరకే, భార్య సీమంతం జరిగిన రోజునే పాపినాయుడు మృతి చెందడం, కడుపులో బిడ్డతో ఉన్న మౌనికను ఒంటరిని చేయడం ఆ ప్రాంతంలో తీరని విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి.