YS Jagan : 7 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్.. జగన్ సంచలనం!

ys jagan

YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం ప్రజల కోసం కాకుండా బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర అప్పులు, సంక్షేమ పథకాల అమలు, పాలకుల విలాసవంతమైన జీవనశైలిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే సీఎం ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ విలాసాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు. “చంద్రబాబు కోసం ప్రత్యేక విమానం, హెలికాప్టర్ సిద్ధంగా ఉంటాయి. లోకేష్ ఒక పూట విజయవాడలో ఉంటే, మరో పూట హైదరాబాద్‌లో ఉంటారు. ఒక క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం లోకేష్ కొలొంబో వెళ్లి, మరుసటి రోజే విజయవాడ వచ్చారు. ఇదంతా ప్రజా ధనం కాదా?” అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం పడిపోతోందని చెబుతూ ఇలాంటి జల్సాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. “2014లో బాబు అధికారంలోకి వచ్చేసరికి అప్పు రూ.1.47 లక్షల కోట్లు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అది రూ.3.90 లక్షల కోట్లకు చేరింది. మా ప్రభుత్వం దిగిపోయే సమయానికి అప్పు రూ.7.21 లక్షల కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు అది రూ.9.74 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని జగన్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అంకెలను తప్పుగా చూపించడం ప్రజలను వంచించడమేనని ఆయన అన్నారు.

సూపర్ సిక్స్’హామీలపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. తల్లికి వందనం పథకాన్ని 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టారని, ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.8,456 కోట్లు మాత్రమే చూపించి కొందరికే ఇస్తున్నారని ఆరోపించారు. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏకంగా 7 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకాన్ని కట్ చేశారని, ప్రతి రైతుకు చంద్రబాబు రూ.30 వేలకు పైగా బాకీ పడ్డారని జగన్ పేర్కొన్నారు. తన హాయాంలో 53 లక్షల మందికి పైగా రైతులకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు.

గత ప్రభుత్వంలో నాడు-నేడు కింద స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడానికి రూ.8,524 కోట్లు ఖర్చు చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని దారుణంగా నడిపిస్తోందని జగన్ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.285 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం చూస్తుంటే విద్యపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. మొత్తం మీద చంద్రబాబు పాలన మోసం.. అబద్ధం అన్నట్టుగా సాగుతోందని జగన్ విమర్శించారు.