మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ మరో వివాదాస్పద ఉత్తర్వులు

మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ మరో వివాదాస్పద ఉత్తర్వులు

ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ పంచాయితీ నడుస్తూనే ఉంది. ఒకరి అధికారాలను ఒకరు చూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు…ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు.

మరోవైపు ఎస్‌ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్ స్పందించారు. ఎస్‌ఈసీ నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు డీజీపీ.