Telangana : పోలీసుల ముందే లవర్స్ పై దాడి.. యువతి మాయం!

telangana

Telangana : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్‌లో పట్టపగలే హైవేపై హైడ్రామా చోటుచేసుకుంది. మనోహరాబాద్‌కు చెందిన సాయినాథ్, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరుకు చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుని, ఇటీవల పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కోరుతూ ఈ జంట మనోహరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

అయితే, పోలీసులు వారిని మేడ్చల్ తరలిస్తుండగా.. 44వ జాతీయ రహదారిపై కాళ్ళకల్ వద్ద యువతి కుటుంబ సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల కళ్లెదుటే సాయినాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు సాయినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.