BCCI సంచలనం.. రోహిత్, కోహ్లీలకు దిమ్మతిరిగే షాక్!

bcci

BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తన వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, టీమిండియా సీనియర్ ఆటగాళ్ల హోదాలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను పూర్తిగా రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.

ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్టులు A+, A, B, C అనే నాలుగు అంచెల్లో ఉన్నాయి. సెలక్షన్ కమిటీ ప్రతిపాదన ప్రకారం వీటిని కేవలం A, B, C అనే మూడు కేటగిరీలుగానే కుదించనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపితే, ఏడాదికి రూ. 7 కోట్లు పొందే A+ గ్రేడ్ కనుమరుగవుతుంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ విలువపై ప్రభావం పడనుంది.

గ్రేడ్ Bలోకి రోహిత్, కోహ్లీ? 

ఈ మార్పులకు ప్రధాన కారణం ఆటగాళ్ల ఫార్మాట్ ప్రాధాన్యతలేనని తెలుస్తోంది. ఆటగాళ్లు ప్రస్తుతం వారు ఎన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు అనే దానిపైనే కాంట్రాక్టులు ఆధారపడి ఉంటాయని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉండటంతో, వారిని గ్రేడ్ B (ప్రస్తుతం రూ. 3 కోట్లు) కిందకు చేర్చే అవకాశం ఉంది. అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు మాత్రమే అత్యున్నత గ్రేడ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

2024-25 జాబితా ప్రకారం.. రోహిత్, కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గ్రేడ్ A+ లో ఉన్నారు. అలాగే మహమ్మద్ సిరాజ్, కె.ఎల్. రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి వారు గ్రేడ్ A లో కొనసాగుతున్నారు. త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నూతన విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ గ్రేడ్లు తగ్గించినా, ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికం పెంచుతారా లేదా అనేది ఆ మీటింగ్‌లో తేలనుంది.