‘‘సూపర్ హ్యూమన్’’ బెన్ స్టోక్స్ : మూడేళ్ల క్రితం విలన్, ఇపుడు నేషనల్ హీరో

యెస్. బెన్ స్టోక్స్ యోధుడే. పడి లేచిన కెరటం అనాలింకా. మూడేళ్ల క్రితం ఇంగ్లాండ్ పాలిట అతను విలన్. 2016 ఏప్రిల్ 3న భారత్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లాస్ట్ ఓవర్ బౌల్ చేసి 4 సిక్సులిచ్చి ఇంగ్లాండ్ ఓటమికి కారణమయ్యాడు. ఫైనల్లో వెస్టిండీస్ గెలవాలంటే చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సిన టైంలో బెన్ స్టోక్స్ కు బాలిచ్చాడు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. అప్పటిదాకా గెలుపు ఇంగ్లాండ్ దే అనుకున్నారంతా. కానీ బ్రాత్ వైట్ ధాటికి బెన్ స్టోక్స్ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. వరుసగా నాలుగు బంతుల్ని సిక్సర్లుగా మలిస్తే… స్టోక్స్ కుప్పకూలిపోయాడు. మొహంలో నెత్తురు చుక్కలేని స్టోక్స్ చాలాసేపు ఫీల్డ్ లో అలా కూర్చుండిపోయాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంతో సహా వరల్డ్ క్రికెట్ మూగబోయింది.

అప్పటినుంచి స్టోక్స్ బాధితుడిగా మారిపోయాడు స్టోక్స్. ఆ ఓటమి కొన్ని నెలల పాటు అతన్ని వెంటాడింది. 2017లో లిక్కర్ తాగి ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడు. దాంతో ఇంగ్లాండ్ టీంకు దూరమయ్యాడు. వరల్డ్ కప్ కు ముందు వరకు అతను టీంలోకొస్తాడన్న గ్యారెంటీ లేని పరిస్థితి. కానీ ఏ మోర్గాన్ అయితే స్టోక్స్ కు బాల్ ఇచ్చి టీ20 వరల్డ్ కప్ కోల్పోవడానికి కారణమయ్యాడో అదే మోర్గాన్ స్టోక్స్ పై నమ్మకముంచాడు. టీంలోకి అతనొస్తే మరింత బలం పెరుగుతుందని మేనేజ్ మెంట్ ని కన్విన్స్ చేశాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని స్టోక్స్.. ఎంత పనిచేశాడో చూశాం కదా. ఆఖరికి సూపర్ ఓవర్ లోనూ మోర్గాన్ స్టోక్స్ నే బ్యాటింగ్ కు పంపాడు. కారణం ఓడిపోతుందనుకున్న ఇంగ్లాండ్ ను పోటీలో నిలబెట్టింది స్టోక్సే. ఫైనల్ ఓవర్లో 15 పరుగులు కావాల్సిన చోట ఓ సిక్స్ బాది.. ఓవర్ త్రోతో మరో సిక్స్ రన్స్ రాబట్టి.. సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ ని తీస్కెళ్లాడు. స్టోక్స్ టీం అదృష్టం అనుకున్నాడేమో. అందుకే అతన్నే బ్యాటింగ్ కు దింపాడు మోర్గాన్. పైగా ఫామ్ లో ఉన్నాడు. మోర్గాన్ నమ్మకం వమ్ముకాలేదు. ఫైనల్ గా టీంకు కప్పు సాధించిపెట్టాడు బెన్ స్టోక్స్. ఫైనల్లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేశాడు.

అదొక్కటే కాదు లీగ్ లో ఫస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై మెరుపు ఫీల్డింగ్, క్యాచ్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన స్టోక్స్.. టోర్నీ అసాంతం నిలకడగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి ఆదుకున్నాడు. సౌతాఫ్రికాపై చేసిన 89 రన్స్, శ్రీలంకపై వీరోచితంగా పోరాడి చేసిన 82 రన్స్, ఆస్ట్రేలియాపై 89, భారత్ పై 79, ఇపుడు ఫైనల్లో 84 రన్స్. ప్రతీ ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. టోర్నీ మొత్తంలో 465 రన్స్ చేసి, 7 వికెట్లు తీసి, ఫీల్డింగ్ మెరుపులు ఇంగ్లాండ్ ని ఛాంపియన్ గా నిలబెట్టడంలో తిరుగులేని పాత్ర పోషించాడు. మూడేళ్ల క్రితం ఇంగ్లాండ్ పాలిట విలన్ గా మారిన బెన్ స్టోక్స్ ఇపుడా దేశానికి నేషనల్ హీరో.

ట్విస్ట్ ఏంటంటే… బెన్ స్టోక్స్ మాతృదేశం న్యూజిలాండ్. క్రైస్ట్ చర్చ్ లో పుట్టిన బెన్.. 12 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ కు వలసవచ్చాడు. తన తండ్రి గెరార్డ్ స్టోక్స్ రగ్బీ కోచ్. క్రికెట్ అంటే ఇష్టం కావడంతో.. కోచింగ్ ఇప్పించాడు. ఇపుడిదిగో నేషనల్ హీరోగా మారిపోయాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఎంత అద్భుతమైన పోరాటం, ఘోరమైన అవమానాలు ఎదుర్కొని ఫినిక్స్ లా లేచి వచ్చిన తీరు అమోఘం. నా పిల్లలకు స్టోక్స్ జీవితాన్ని పాఠంగా చెప్తా’’ అని అన్నాడంటే… ఇంగ్లాండ్ పై ఎంత బలమైన ముద్ర వేశాడో అర్థం చేసుకోవచ్చు. ట్రాజెడీ ఏంటంటే… తన మాతృభూమి న్యూజిలాండ్ ను ఓడించి ఇంగ్లాండ్ కు కప్పు కట్టబెట్టడం స్టోక్స్ కు తీరని వేదననే మిగిల్చింది. అందుకేనేమో కేన్… నీకు జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటా అని అన్నాడు. గప్తిల్ ఓవర్ త్రోతో వచ్చిన ఆరు రన్నులు న్యూజిలాండ్ ఫేట్ మార్చాయి. అందులో తన ప్రమేయం ఏం లేకపోయినా… న్యూజిలాండ్ కు కప్పు దూరం చేసిన థ్రో అది. అందుకే న్యూజిలాండ్ కు క్షమాపణలు చెప్పి తన మనసు చాటుకున్నాడు. బెన్ స్టోక్స్ ను క్రీడా ప్రపంచం అంటోంది ‘‘సూపర్ హ్యూమన్’’ అని. హాల్ అఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోబోతున్నాడు. చీర్ అప్ స్టోక్స్

LEAVE A REPLY