సొంత లాభం కోసం పార్టీ మారడం తప్పు : చంద్రబాబు నీతులు

పార్టీ ఫిరాయింపులు. దేశవ్యాప్తంగా రచ్చగా మారిన ఓ గొట్టు సబ్జెక్ట్. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్. కాదేదీ ఫిరాయింపులకు అనర్హం అన్నట్టు.. అధికారంలో ఉన్న ప్రతీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించిన గులాబీ బాస్.. ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని, ముగ్గురు ఎంపీలను లాగేస్కుని… నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు. పార్టీ ఫిరాయింపులకు ఈ ఇద్దరు నేతలు దేశానికే రోల్ మోడల్ గా మారారు.

ఇపుడు విషయమేంటంటే.. పార్టీ ఫిరాయింపులు తప్పట. స్వప్రయోజనాల కోసం పార్టీ మారడం అవకాశవాదమే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇందులో సంచలనం ఏం లేదు గానీ.. చంద్రబాబు నోటి నుండి రావడమే సంచలనం అన్నమాట. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబుకు వలయంగా ఉండి రక్షించేందుకే ఆ ఎంపీలు బీజేపీలో చేరారన్నది వేరే విషయం. అది టీడీపీ-బీజేపీ క్విడ్ ప్రో కో అన్న విశ్లేషణలున్నాయి. అదిక్కడ అప్రస్తుతం. రేపో-ఎల్లుండో ఎమ్మెల్యేలూ గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఫిరాయింపులపై వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఫిరాయింపులపై నాలిక మడతపెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చిన చంద్రబాబేనా ఈ వ్యాఖ్యలు చేసిందీ అని ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోల్పోతే తప్ప తత్వం బోధపడలేదన్నమాట అని గుసగుసలాడుకుంటున్నారు.

LEAVE A REPLY