IBOMMA : దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ చేసిన ఐబొమ్మ నిర్వహకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్మెంట్లో ఇమ్మడి రవి( Immadi Ravi ) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇమ్మడి రవిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నడుపుతున్నాడు రవి. భార్య వదిలేయడతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఇమ్మడి రవి అకౌంట్లో రూ. 3 కోట్లు ఉండగా వాటిని ఫ్రీజ్ చేశారు పోలీసులు. అంతేకాకుండా అతని సర్వర్ లో ఉన్న మూవీ కంటెంట్ ను కూడా పోలీసులు డిలీట్ చేశారు.పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ వెనుక ఉన్న పూర్తి పైరసీ నెట్‌వర్క్‌ను గుర్తించడానికి, దానిపై చర్యలు తీసుకోవడానికి లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
పోలీసులు సోమవారం (నవంబర్ 17, 2025) ఇమ్మడి రవిని మీడియా ముందు ప్రవేశపెట్టి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఆ సమయంలో వెబ్‌సైట్‌ను శాశ్వతంగా ఎలా నిలిపివేస్తారు అనే దానిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో వచ్చే సినిమాలు సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వెంటనే అందుబాటులోకి వస్తాయి.
దీని కారణంగా సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు రావలసిన ఆదాయంలో భారీగా నష్టం వాటిల్లుతుంది. నిర్మాతలు దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే పట్టుకోవాలంటూ సవాల్ చేశాడు. ఇప్పుడు అడ్డంగా దొరికియాడు.
సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసిన రవి.. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గత 6 నెలలుగా రవి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.. సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు రవి నష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
