IBOMMA : పాములు పట్టేవాడు పాము కాటుకే బలి అయినట్లుగా.. ఇన్ని రోజులు ఎక్కడో ఉంటూ ఐబొమ్మ అంటూ ఓ వెబ్ సైట్ నడుపుతూ తెలుగు ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఏకంగా పోలీసులకు సవాల్ చేసిన ఇమ్మడి రవి చేతే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను క్లోజ్ చేయించారు పోలీసులు. ఇప్పుడీ సైట్లు ఓపెన్ కావడం లేదు. వెబ్ సైట్ లాగిన్స్, సర్వర్ వివరాలతో వాటిని రవి చేతే క్లోజ్ చేయించారు పోలీసులు.
కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ ను నడిపించాడు రవి. అతడి వద్ద వందల హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు చెక్ చేస్తున్నారు.మరోవైపు రవిని కస్టడీ కోరుతూ సోమవారం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు 14 రోజల పాటు రిమాండ్ విధించింది. రవి కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. రవిని అరెస్టు చేసేందుకు పోలీసులు గత ఆరు నెలలుగా గాలిస్తున్నారు.
ఐబొమ్మ వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే సినీ పరిశ్రమతో పాటు పోలీసుల వ్యక్తిగత జీవిత రహస్యాలు బయటపెడతానని బెదిరించడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ సవాల్‌ను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అరెస్ట్ చేశారు. పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు రూ. 3,000 కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా.
ఇమ్మడి రవికి వివాహం జరిగింది. ఇతడు తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. రవి తన భార్యతో ఉన్న కుటుంబ సమస్యల కారణంగానే విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం రవి భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తో్ంది. ఇతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ (సీజ్) చేశారు.
