Prathyusha Sadhu : ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించిన ఈ స్పోర్ట్స్ బ్యూటీ ఎవరో తెలుసా?

prathyusha.sadhu

Prathyusha Sadhu :  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో ఓ చిన్న రోల్ లో నటించి మెప్పించింది బ్యూటీ ప్రత్యూష సాధు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో పవన్ ఏంట్రీ సీన్ లో కనిసిస్తుంది. విలన్స్ ఈమెను భర్తతో పాటు హింసిస్తుండటంతో హీరో పవన్ వచ్చి కాపాడుతాడు. ఇంతకు ఈమె ఎవరంటే..

ప్రత్యూష సాధు. రాజమండ్రిలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగారు. ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఇంట్లో పుస్తకాలు, పద్యాలు చదివించే అలవాటు ఉండటంతో తెలుగుపై పట్టు దొరికింది. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా అనూహ్యంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు క్రిష్ ఆమెను చూడగానే ఆడిషన్ కూడా లేకుండానే ఫస్ట్ టేక్ ఓకే చేసేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు.

నటిగా కొనసాగుతున్న సమయంలోనే ఒక స్నేహితుడి ద్వారా స్పోర్ట్స్ ప్రెజెంటర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి సరదాగా ప్రయత్నించారు. నిజానికి ఆమెకు క్రికెట్ మీద అంత పెద్దగా అవగాహన లేదు, కానీ సెలెక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెలెక్ట్ అయిన మరుసటి రోజే ముంబై రమ్మనడంతో, ఆట గురించి తెలుసుకునే టైం కూడా దొరకలేదు. అయినా సరే, ఏమాత్రం భయపడకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం రెండున్నర గంటల పాటు లైవ్ షో చేసి అందరినీ మెప్పించారు. ఇది చూసిన వాళ్లందరూ ఎంతో అనుభవం ఉన్న దానిలా చేశావు అని మెచ్చుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

ఈ ప్రయాణంలో ప్రత్యూషకు తన భర్త వరుణ్ సాధు (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), అత్తమామల నుంచి పూర్తి మద్దతు లభించింది. భర్తకు క్రికెట్ అంటే ఇష్టం కావడంతో, ఆటలోని మెళకువలను ఆయన దగ్గరే అడిగి తెలుసుకునేవారు. ఐపీఎల్ సమయంలో మూడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉంటూ, నిద్ర లేకపోయినా స్టూడియోకి వెళ్లగానే రెట్టింపు ఉత్సాహంతో పని చేసేవారు.

కొత్త ప్లేయర్స్ గురించి లోతుగా తెలుసుకుని, వాళ్ల కష్టాలను ప్రేక్షకులకు వివరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లిష్టమైన పదాలు వాడకుండా స్పష్టమైన తెలుగులో ఆమె చేసే కామెంటరీకి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో అటు నటిగా, ఇటు స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా రెండు రంగాల్లోనూ రాణించాలన్నదే తన లక్ష్యమని ప్రత్యూష చెబుతున్నారు.

Also Read :