Rashmika Mandanna: నటి రష్మిక మందన్న ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 2026లో నటుడు విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక, ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్న మాట్లాడినట్లు చెబుతున్న ఒక పాత ఆడియో క్లిప్ ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది రష్మికను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉండటంతో ఆమె గట్టిగా స్పందించారు.

నిజానికి ఆ ఆడియో ఇప్పటిది కాదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రష్మికకు, కన్నడ నటుడు రక్షిత్ శెట్టికి నిశ్చితార్థం జరిగినప్పుడు జరిగిన ప్రైవేట్ సంభాషణ అది. అప్పట్లో వారిద్దరూ విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు రష్మిక పెళ్లయిన వేళ కావాలనే ఎవరో ఆ పాత ఆడియోను బయటకు తీశారు. అందులో రష్మిక ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తల్లి మాట్లాడుతున్నట్లు ఉంది. దీనిపై రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ లేఖ రాశారు.

గత ఎనిమిదేళ్లుగా తనపై ఎవరో ఒకరు తప్పుడు వార్తలు రాస్తూనే ఉన్నారని, తన మాటలను తప్పుగా వాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాను ఎంత బాధ కలిగినా మౌనంగానే ఉన్నానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతుండటంతో ఇక భరించలేనని చెప్పారు. ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తి వ్యక్తిగత సంభాషణను రికార్డ్ చేయడం, దాన్ని పబ్లిక్ చేయడం చట్టరీత్యా తప్పని ఆమె గుర్తు చేశారు.

ఈ ప్రచారాలను ఆపకపోతే ఊరుకునేది లేదని రష్మిక హెచ్చరించారు. ఆ ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేసిన మీడియా సంస్థలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే వాటిని తొలగించాలని కోరారు. దీనికోసం ఆమె 24 గంటల సమయం ఇచ్చారు. ఒకవేళ రేపటిలోగా ఆ వీడియోలను తీసేయకపోతే, పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన గౌరవానికి భంగం కలిగిస్తూ, తన ప్రశాంతతను చెడగొట్టే హక్కు ఎవరికీ లేదని రష్మిక తేల్చి చెప్పారు.
