Sapthami Gowda : మా బాడీ పార్ట్స్ పై జూమ్ చేస్తారా?.. సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!

Sapthami Gowda

Sapthami Gowda : ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ సప్తమి గౌడ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల నితిన్ సరసన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి, తాజాగా సోషల్ మీడియా వేదికగా కొందరు ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ కార్యక్రమాల్లో నటీమణులను అసభ్యకరమైన కోణాల్లో చిత్రీకరించడంపై ఆమె గట్టిగా నిలదీసింది.

సప్తమి గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తింది. సినిమా ఈవెంట్లకు లేదా పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు, కొందరు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కావాలనే నటీమణులను అభ్యంతరకరమైన యాంగిల్స్‌లో షూట్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ముఖ్యంగా శరీర భాగాలను అనవసరంగా జూమ్ చేస్తూ వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె మండిపడింది.

నటీనటులు వస్తువులు కాదు అంటూ సప్తమి ఘాటుగా స్పందించింది. ఇలాంటి వికృత చేష్టలను నటీమణులందరూ కలిసికట్టుగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొంది. కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం ఒక మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికింది.

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. గతంలో కూడా పలువురు హీరోయిన్లు ఇలాంటి ‘బ్యాడ్ యాంగిల్’ ఫోటోగ్రఫీపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు సప్తమి గౌడ చేసిన వ్యాఖ్యలకు ఇతర నటీమణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

మరోవైపు ఎయిర్‌పోర్టుల్లో, సినిమా ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు ప్రవర్తిస్తున్న తీరుపై కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము ఇక్కడ సినిమా కోసం పని చేస్తున్నాం. కానీ కొందరు ఫోటోగ్రాఫర్లు హద్దులు మీరుతున్నారు. ఈవెంట్లలో లేదా ఎయిర్‌పోర్టుల్లో ఫోటోలు తీస్తున్నప్పుడు హీరోయిన్ల శరీర భాగాలను కావాలనే జూమ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు” అని మండిపడ్డారు. కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం ఒక మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.