Srinu Vaitla : డైరెక్టర్ శ్రీను వైట్లకు భారీ టోపీ.. రూ. 7కోట్లు గోవిందా!

Srinu Vaitla

Srinu Vaitla :  ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ భూమి మోసంలో చిక్కుకున్నారు. దాదాపు ₹7.2 కోట్ల విలువైన ఈ ల్యాండ్ ఫ్రాడ్‌కు సంబంధించి ఆయన తాజాగా హైదరాబాద్‌లోని సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన మేనకోడలు శ్వేత కూడా ఈ మోసానికి గురైనట్లు ఆయన తన ఫిర్యాదులో వివరించారు.

ఈ గొడవ 2019లో మొదలైంది. వికారాబాద్ జిల్లాలోని కడ్మూర్ అనే ఊరిలో కొన్ని భూములు ఉన్నాయని, అక్కడ గనుక ఇప్పుడు డబ్బులు పెడితే భవిష్యత్తులో కోట్లు సంపాదించవచ్చని కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను నమ్మించారు. ఆ సమయంలో నిందితులు కొన్ని కాగితాలు చూపించి, ఆ భూమికి సంబంధించి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని, ఎటువంటి గొడవలు లేవని నమ్మబలికారు. ఆ మాటలు నిజమే అని నమ్మిన శ్రీను వైట్ల, తన మేనకోడలితో కలిసి ఆ భూమిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పనులన్నీ పూర్తి చేసి, చెప్పిన ప్రకారం పూర్తి డబ్బులు కూడా చెల్లించారు.

అయితే, రిజిస్ట్రేషన్ అయిపోయిన కొన్నాళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది. తాము కొన్న భూమి అసలు ఆ అమ్మిన వ్యక్తులది కాదని, అది వేరే వాళ్ల సొంతమని శ్రీను వైట్లకు తెలిసింది. నిందితులు చూపించిన డాక్యుమెంట్లన్నీ దొంగవని, కేవలం డబ్బులు కొట్టేయడానికే ఇలా పక్కా ప్లాన్‌తో మోసం చేశారని ఆయన గ్రహించారు. తాము కష్టపడి సంపాదించిన ₹7.2 కోట్లు ఇలా బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

బయట ఎన్నిసార్లు అడిగినా నిందితులు సరైన సమాధానం చెప్పకపోవడంతో, చివరకు శ్రీను వైట్ల చట్టం ద్వారా పోరాడాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆ దొంగ కాగితాలను ఎలా సృష్టించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.