Mohanlal :400కు పైగా సినిమాలు చేసి, మలయాళంలో ఫేవరెట్ హీరో అనిపించుకున్న మధు(మాధవన్ నాయర్) ఇంకా జీవించి ఉన్నారు. 500 సినిమాల దాకా చేసి, గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న మలయాళ నటి షీలా ఇంకా ఉన్నారు. తెలుగునాట పుట్టి, కేరళకు వెళ్లి, మలయాళంలో రెండు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న శారద కూడా మనముందే ఉన్నారు. మలయాళ సినిమాలకు స్టార్ విలువ అందించిన దర్శకుడు హరిహరన్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా మనకు తెలియని వాళ్లు చాలామంది సినీరంగ ప్రముఖులు కేరళలో ఉన్నారు. అఫ్‌కోర్స్, హీరో మమ్ముట్టి కూడా ఉన్నారు.
…కానీ ఇంతమందిని కాక, నటుడు మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారం రావడం సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని ఏకకాలంలో తీసుకొచ్చింది. దేశం మెచ్చే నటుల్లో మోహన్‌లాల్ ఒకరు. ఆ విషయాన్ని ఎవరూ కాదనరు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాలు, మూడుసార్లు జాతీయ పురస్కారాలు, కోట్లాది మంది అభిమానాన్ని పొందారు. ‘పాదముద్ర’, ‘ఇరువర్(తమిళం)’, ‘కాలాపానీ’, ‘కడవు’, ‘భరతం’, ‘వానప్రస్థం’, ‘ప్రణయం’ తదితర సినిమాలు ఆయన నటనా ప్రతిభకు కొన్ని తార్కాణాలు. అలాంటి నటుడికి దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారం రావడం నిజంగా సముచితం. కానీ వయసులోనూ, అనుభవంలోనూ అంతకుమించి అర్హత కలిగిన వ్యక్తులు మలయాళ సినీరంగంలోనే ఉండగా, వారిని పక్కన పెట్టి ఆయనకు ఇవ్వడం వెనక కారణం ఏమిటనేదే ఇప్పుడు చర్చగా మారింది.
…ఇది మాత్రమే కాదు, అసలు విషయం ఇంకా లోతైనది. దిలీప్ అనే మలయాళ నటుడు భావన అనే నటిని లైంగికంగా వేధించిన ఉదంతం 2018లో సంచలనమైంది. దీనికి నిరసనగా కొందరు నటులు మలయాళ సినీ నటుల అసోసియేషన్(అమ్మా)కు రాజీనామా చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ ఆ విషయాన్ని సరిగ్గా డీల్ చేయలేదని, నటిపై లైంగిక వేధింపుల విషయాన్ని లైట్ తీసుకున్నారని చాలామంది బహిరంగంగానే ఆరోపించారు. అనంతరం హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతోపాటు దుబాయిలో ఓ వేదిక ఎదుట కూర్చున్న మోహన్‌లాల్ తన చేతులతో అసభ్యంగా సైగలు చేయడం, పక్కనే హీరో మమ్ముట్టి నవ్వుతూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది. అనేకమంది నెటిజన్లు ఆయన చర్యను ఖండించారు.(శ్రుతిహాసన్‌ని చూస్తూ ఆయన అలా చేశారని వైరల్ అయ్యింది కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది). అక్రమంగా ఏనుగు దంతాలను, ఏనుగు దంతాలతో చేసిన ఆకృతులను కలిగి ఉన్నందుకు మోహన్‌లాల్‌పై గతంలోనే కేసు నమోదైంది. ఇలాంటి పలు వివాదాలున్న వ్యక్తికి దాదాసాహెబ్ ఫాల్కే ఏమిటనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది.
…మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే రావడం వెనుక అధికార బీజేపీహస్తం ఉందనే మాట వినిపిస్తూ ఉంది. ‘హయ్యో! ప్రతిచోటా రాజకీయాలేనా? గొప్ప నటుడికి అవార్డు వస్తే సంతోషించక ఏంటీ ఆరాలు?’ అని మీరు అనుకోవచ్చు గాక, కానీ Everything is Political. ఈ దేశంలో ప్రతి విషయం వెనుక ఓ రాజకీయ కోణం ఉండే అవకాశం ఉంది. మోహన్‌లాల్ బీజేపీలో చేరకపోయినా, పలు మార్లు మోదీని పొగిడిన సందర్భాలున్నాయి. నగదు ఉపసంహరణ(Demonitization) సమయంలో మోదీకి మద్దతు తెలుపుతూ ‘వైన్స్ ముందు గంటలపాటు నిలిచి ఉండేందుకు ఓపికుంది కానీ, బ్యాంక్ ముందు నిల్చునే ఓపిక లేదా?’ అని రాసిన కామెంట్ చాలా వైరల్ అయ్యింది. ‘మో*దీది చాలా గొప్ప ఆలోచన’ అని ప్రశంసించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోహన్‌లాల్‌కు బీజేపీనుంచి ఎంపీ టికెట్ వస్తుందనే ప్రచారం కూడా సాగింది. అదేమీ జరగలేదు కానీ, అంతర్గతంగా ఆయన ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికినట్లు వార్తలొచ్చాయి.
…తన తల్లిదండ్రుల గుర్తుగా మోహన్‌లాల్ ప్రారంభించిన ‘విశ్వశాంతి ఫౌండేషన్’లోని సభ్యుల్లో అధికభాగం ఆర్‌ఎస్ఎస్, బీజేపీతో సత్సంబంధాలు కలిగినవారే ఉన్నారు. మోహన్‌లాల్ సన్నిహితుల్లో అనేకులు బీజేపీలో సభ్యులు. దీనికితోడు కేంద్రం నిర్ణయాలపై కేరళ ప్రజలు నిరసన తెలిపిన పలు సందర్భాల్లో కూడా మోహన్‌లాల్ మౌనాన్ని పాటించారు తప్ప, కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయలేదు. ఇవన్నీ కలిపి ఆయనకు ఆర్‌ఎస్ఎస్,బీజేపీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇదంతా కలిసి ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అందించిందా? ఈ అవార్డును ఆ కోణంలోనే చూడాలా? , బీజేపీకి మద్దతు పలికిన వారికి ఈ అవార్డు ఇవ్వకూడదన్న నిబంధనేమీ లేదు. తప్పకుండా ఇవ్వొచ్చు. ఎటొచ్చీ, ఆ విషయం తేటతెల్లమైతే సరి!
మలయాళ చిత్ర పరిశ్రమకు వచ్చిన రెండో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఇది. 1969లో మొదలైన ఈ పురస్కారం 2004లో దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్‌ను వరించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు రెండోసారి మలయాళ చిత్రపరిశ్రమకు దక్కింది. ఇది సంతోషించదగ్గ అంశమే! నటుడిగా మోహన్‌లాల్ అందుకు అర్హుడే! కానీ పరిస్థితులు, పరిణామాలు విశ్లేషించుకుంటూ వెళ్తే ఎన్నో కోణాలు బయటపడతాయి.
- విశీ(వి.సాయివంశీ)