Yellamma Glimpse : వేణు నువ్వు మాములోడివి కాదురా!

Yellamma Glimpse

Yellamma Glimpse : బలగం వంటి అద్భుతమైన విజయం తర్వాత దర్శకుడు వేణు ఎల్డండి మరోసారి తెలంగాణ మట్టి వాసనను, ఆచారాలను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక అణగారిన వర్గం ఆత్మగౌరవ ప్రయాణంగా కనిపిస్తోంది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ కనిపిస్తున్న తీరు, ఆయన మెడలోని డప్పు.. ఒక సామాజిక నేపథ్యాన్ని బలంగా ప్రతిబింబిస్తున్నాయి.

‘బలగం’తో చావులోని బంధుత్వాన్ని చూపించిన వేణు, ఈసారి ఎల్లమ్మతో మట్టిలో పుట్టిన తిరుగుబాటును చూపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

గ్లింప్స్‌లో దేవి శ్రీ ప్రసాద్ తన మెడలో డప్పు వేసుకుని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. సాధారణంగా పండగల్లో, జాతరల్లో వినిపించే ఆ డప్పు చప్పుడు వెనుక ఉన్న ఒక సామాజిక వర్గపు వేదనను, వారి జీవన పోరాటాన్ని పర్సి అనే పాత్ర ద్వారా వేణు చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.

“This is resistance born from the soil” (ఇది మట్టి నుంచి పుట్టిన నిరోధకత) అనే క్యాప్షన్ చూస్తుంటే, అణచివేతకు గురైన ఒక వర్గం తమ సంప్రదాయం ద్వారా, తమ కళ ద్వారా ఎలా ఎదురుతిరిగింది అనే పాయింట్‌ను వేణు టచ్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతలకు, డప్పు కళాకారులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించబోతున్నారు.

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో స్టేజ్ పై ఎనర్జీ ఇచ్చే DSP, ఇందులో పక్కా మాస్, రా లుక్‌లో కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ విలువలు, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.