CM Chandrababu : తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

CM Chandrababu

CM Chandrababu :తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎంచంద్రబాబు (CM Chandrababu)తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరినీ విడిచిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం డబ్బు కోసం చేసిన కక్కుర్తి కాదని, దేవుడిని అపవిత్రం చేయాలనే పెద్ద కుట్ర ఇందులో దాగి ఉందంటూ సీఎం ఆరోపించారు. నెయ్యిలో పొరపాట్లు జరిగినట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) స్పష్టమైన నివేదిక ఇచ్చిందని, కల్తీ జరగలేదని ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఏకసభ్య కమిటీని వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీబీఐ నివేదికతో సహా అన్ని ఆధారాలను ఈ కమిటీ ముందు ఉంచుతామని, నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వెళ్లాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడే పరిస్థితి ఉండేదని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండలేమని సీఎం అన్నారు.

తాము వాస్తవాలు మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని సీఎం మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడటం తమ బాధ్యతని, భక్తులకు నమ్మకాన్ని కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. లడ్డూలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని నివేదికలు రావడం అత్యంత దారుణమన్నారు. “గతంలో ఆలయాల దగ్గర ఏం జరిగినా పిచ్చోళ్ల పని అని కొట్టిపారేశారు. కానీ ఈ కల్తీ వ్యవహారం గురించి తెలిసినప్పుడు, దీనిని ప్రజల దృష్టికి తీసుకెళ్లకపోతే మేం తప్పు చేసిన వారం అవుతామని భావించి నిజాలు బయటపెట్టాం అని తెలిపారు.